“ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యంతో పాటు మీకు ఇందిరమ్మ ఇండ్లు, తాగునీరు వంటి సౌకర్యాలన్నీ కల్పిస్తాం. కానీ ప్రతిఫలంగా నేను మీ నుంచి ఆశిస్తున్నది ఒక్కటే…” అంటూ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడకు చెందిన ఆదివాసీ మహిళలను అడిగారు.
సీఎం రేవంత్ రెడ్డి మాటఏం అడుగుతారోనని ఆసక్తిగా వింటున్న మహిళలను ముఖ్యమంత్రి గారు అడిగింది ఒక్కటే…
“మీరు ఒక పూట ఉపవాసం ఉన్నా సరే మీ పిల్లలను మాత్రం చదివించాలి అని కోరుతున్నా.. చదివిస్తామని మాట ఇవ్వండి..”
కొత్తగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశ శుభకార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సమయంలో ఆదివాసీలతో జరిగిన ముఖాముఖి సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇందిరమ్మ ఇళ్లు, పైలాన్ ఆవిష్కరణ
ముఖ్యమంత్రి గారు ముందుగా రెండో విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరించారు.
కొత్తగూడ గూడెంలో 25 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, గ్రామానికి చెందిన సిడం కన్నీబాయి, టెకం పగ్గుబాయి, ఆత్రం పోచుబాయిలకు చెందిన ఇందిరమ్మ గృహాలను స్వయంగా కుటుంబసభ్యులతో కలిసి ప్రారంభించి పరిశీలించారు.
నూతన సాంకేతికతతో నిర్మించిన ఇండ్లను పరిశీలించి ఆదివాసీ బిడ్డలకు ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి గారి రాక సందర్భంగా ఆదివాసీలు తమ సాంప్రదాయ గుస్సాడి నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. గృహ ప్రవేశ శుభవేళ ముఖ్యమంత్రి గారు, మంత్రులకు ఆదివాసీలు సంప్రదాయ పిండి వంటలను రుచి చూపించారు.
చదువొక్కటే మార్పు
అనంతరం గ్రామ మహిళలతో ముఖ్యమంత్రి గారు ముఖాముఖి మాట్లాడారు.
“మీ పిల్లలు చదువుకోకపోతే మీ జీవితాల్లో మార్పు రాదు. చదువొక్కటే మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. చదువొక్కటే మీ జీవితాల్లో వెలుగులు నింపుతుంది..”
అని చెబుతూ వారితో చదివిస్తామన్న మాట తీసుకున్నారు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించిన సందర్భంలో ఇవి సరిపోవని చెప్పినప్పుడు గూడాల్లో తండాల్లో, ఐటీడీఏల్లోని ఆదివాసీ ఏ ప్రాంతమైనా అందరికీ ఇండ్లు ఇవ్వాలని 21,000 ఇండ్లను అదనంగా మంజూరు చేశామని చెప్పారు.
ఇండ్లు లేనివారంటూ ఉండరాదన్నది నిర్ణయం. అందుకే రెండో విడతగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 2.5 లక్షల ఇండ్లను మంజూరు చేసిన కార్యక్రమాన్ని కూడా ఇక్కడినుంచే ప్రారంభించాం. రాష్ట్రంలోని ఏ గూడెంలోనూ గుడిసె ఉండటానికి వీలులేదు.
అన్ని గూడాల్లో పేదోళ్లకు ఇండ్లను మంజూరు చేయాలి. ఏడాది తిరిగేలోగా మళ్లీ ప్రవేశాలు చేసుకుందాం. తండాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 365 రోజుల్లోగా అందరికీ ఇండ్లు మంజూరు చేయాలి అని అక్కడి నుంచే అధికారులను ఆదేశించారు.
మహిళల అభ్యున్నతి, సంక్షేమం
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. మహిళా సంఘాలకు అందించే రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాం. ప్రజా ప్రభుత్వం మహిళల అభ్యున్నతిని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం.
“అందరికీ ఇండ్లు ఇస్తాం. అందరూ సంతోషంగా ఉండాలి. ఇండ్లు తీసుకున్న వారెవరూ వాటి నిర్మాణాన్ని మధ్యలో ఆపొద్దు..” అని ముఖ్యమంత్రి గారు కోరారు.





