ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్: ప్రభుత్వ విద్యకు కొత్త అధ్యాయం

ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్: ప్రభుత్వ విద్యకు కొత్త అధ్యాయం

ఆరుట్ల గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభిలషించారు. ప్రభుత్వ పాఠశాలలంటే అనాధలు, ఆర్థికంగా చితికిపోయిన వారు చదువుకుంటారన్న అభిప్రాయాన్ని సంపూర్ణంగా మార్చి, మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్న సంకల్పంతో ఈ పాఠశాలను ప్రారంభించారు.

కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వసతులతో రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తీర్చిదిద్దిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఇదే సందర్భంగా విద్యార్థులకు ఉదయం అందించే బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

27 లక్షల విద్యార్థులకు స్ఫూర్తి

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఆరుట్ల పబ్లిక్ స్కూల్ స్ఫూర్తిగా నిలుస్తుందంటూ, పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేనేజ్‌మెంట్ కమిటీకి అభినందనలు తెలిపారు.

“ప్రభుత్వ పాఠశాల అనగానే తక్కువగా భావించే విధంగా అందరి మదిలో నెలకొన్న అనుమానం, అపనమ్మకాలను పోగొట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థి కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రాణించగలరన్న ఒక బృహత్తర సంకల్పంతో ఈ పాఠశాలను తీర్చిదిద్దాం. ఆరుట్ల పాఠశాల తెలంగాణకు ఒక రోల్ మోడల్‌గా, స్ఫూర్తిదాయకంగా నిలవాలి” అని అన్నారు.

విద్యా విధానంలో వికాసం

“విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు నడిపించే విధంగా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆదర్శంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నా. ఈ స్కూల్ రోల్ మోడల్‌గా ఎలా నిలుస్తుందో ఎవరొచ్చినా చూపించాలి. ఈ అద్భుతమైన కార్యానికి ప్రజలు సంపూర్ణంగా అండదండలు అందించాలి” అని ముఖ్యమంత్రి గారు కోరారు.

“అభివృద్ధి అంటే అద్దాల మేడల్లో, రంగుల గోడల్లో కాదు. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. విద్యపై పెట్టే ఖర్చు భవిష్యత్తు పెట్టుబడి అని సంపూర్ణంగా విశ్వసిస్తా. విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావాలి, అంటరానితనాన్ని, అసమానతలను నిర్మూలించాలి” అని పేర్కొన్నారు.

8 శాతం బడ్జెట్ విద్యాశాఖపై

మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌లో 8 శాతానికి పైగా, దాదాపు రూ.26 వేల కోట్లు విద్యాశాఖపై, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

“ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠశాలలో 1814 మంది పిల్లలు చేరగా, సీట్లు ఖాళీ లేవని, అడ్మిషన్లు పూర్తయ్యాయని ప్రభుత్వ పాఠశాల బయట బోర్డు పెట్టే పరిస్థితికి రావడం పట్ల కమిటీని అభినందిస్తున్నా. ఉపాధ్యాయులు తెలంగాణ సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలబడ్డారు” అని ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

Arutla Telangana Public School Meeting Arutla Telangana Public School Meeting Arutla Telangana Public School Meeting

ఆరుట్ల రామచంద్రారెడ్డి పాత్ర మరువలేనిది

“తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి గారి పాత్ర మరువలేనిది. అందుకే ఇక్కడ పాఠశాలను తీర్చిదిద్దాం. ఆరుట్ల గ్రామ ప్రజలు, తల్లిదండ్రులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలో తీసుకుని ప్రతి పేదవారికి విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం” అని వివరించారు.

“ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే చిన్నతనం కాదు. ముఖ్యమంత్రిగా నేనే కాదు. దేశంలో గొప్ప గొప్ప వాళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారే. కేవలం సంక్షేమ పథకాలు భవిష్యత్తును మార్చలేవు. మన భవిష్యత్తు మారాలన్నా, తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతకాలంటే చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మన ఊరికి, మన రాష్ట్రానికి, దేశానికి పేరొస్తుంది” అని హితవు చెప్పారు.

స్కూల్ కిట్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో

ముఖ్యమంత్రి గారు స్కూల్ కిట్ల గురించి చెబుతూ:

“ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ డ్రెస్సులు, షూలు, సాక్సులు, దుప్పట్లు, స్కూల్ బ్యాగులతో కూడిన కిట్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో, అంతర్జాతీయ సంస్థలతో తయారు చేయిస్తున్నాం. రూ.688 కోట్లతో టెండర్లు పిలిచాం. పనులు జరుగుతున్నాయి. జూలై ఆఖరు నుంచి వాటిని పంపిణీ చేస్తాం” అని చెప్పారు.

మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రమాణం

“మాదక ద్రవ్యాల వాడకం ఒక మహమ్మారిగా మారింది. ఈ దురలవాట్లను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 19వ తేదీన ఎల్బీ స్టేడియం వేదికగా రాష్ట్ర గవర్నర్ గారి సమక్షంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థినీ, విద్యార్థులతో ప్రమాణం చేయించే కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులను చైతన్యం చేసే కార్యక్రమం చేపడుతున్నాం” అని తెలిపారు.

గంజాయి లేదా ఇతరత్రా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను కోరారు.

స్కిల్స్ యూనివర్సిటీ — బ్లూ కాలర్ ఉద్యోగాలు

“ఏఐతో ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో నైపుణ్యాలను నేర్పించి బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. మొదటి ఏడాదిలోనే అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కి మంచి అవకాశాలు పొందడం సంతోషించదగిన విషయం” అని వ్యాఖ్యానించారు.

స్పోర్ట్స్ యూనివర్సిటీ — మెస్సీని హైదరాబాద్ రప్పించాం

“140 కోట్ల జనాభా కలిగిన దేశం నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో రాణించలేకపోతున్నాం. ఒక్క స్వర్ణ పతకాన్ని కూడా సాధించలేకపోతున్నామంటే తలదించుకోవాల్సిన పరిస్థితి. అందుకే పబ్లిక్-ప్రైవేట్ మోడల్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. విద్యార్థులు, క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపడానికే ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్ రప్పించాం” అని గుర్తుచేశారు.

27 లక్షల విద్యార్థులకు నాణ్యమైన విద్య

ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ నలుమూలల స్ఫూర్తిగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.