ఓటర్ల జాబితా SIRలో లోపాలు.. గడువు పొడిగించాలని ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

ఓటర్ల జాబితా SIRలో లోపాలు.. గడువు పొడిగించాలని ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేరు ఒక్కటి కూడా తొలగకూడదని, అనర్హులు ఎవరూ జాబితాలో చేరకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఆయన లేఖ రాశారు. అభ్యంతరాలు తెలిపే గడువు పొడిగించడంతో పాటు ఓటర్లకు తగినంత సమయం, సహాయం అందించాలని కూడా ఆయన అభ్యర్థించారు.

ఎంతమంది ఓటర్లపై ప్రభావం పడనుంది?

జూన్ 10, 2026 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 73.39 లక్షల మందిని (21.7 శాతం) గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్ల (ASDD) జాబితాలో గుర్తించినట్లు ఎన్నికల సంఘం గణాంకాలను ఉటంకిస్తూ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వర్గంలో 62 శాతానికిపైగా, అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉండగా, 32.36 లక్షల పత్రాలను పాత ఓటర్ల జాబితాతో అనుసంధానం చేయలేదని ఆయన వివరించారు. ఫలితంగా దాదాపు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని, ఇది రాష్ట్ర ఓటర్లలో మూడో వంతు మందిని ప్రభావితం చేస్తుందని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ASDD ఓటర్లలో 58.6 శాతం, పరిశీలన నోటీసుల్లో 41.9 శాతం కేంద్రీకృతమై ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాలు, వివాహాలు, తాత్కాలిక నివాస మార్పుల వల్ల పట్టణ ఓటర్లు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సవరణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉన్నాయి?

గణన సిబ్బంది పరిశీలనకు వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇంట్లో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకే గాటన కడుతున్నారని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. నిజంగా నివాసం మారిన వారికి కొత్త చిరునామాలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా ఎలాంటి సహాయం అందించకుండానే, పాత చిరునామాలోని పేరును తొలగిస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాక, పేర్లు తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను కూడా పాటించడం లేదని పేర్కొన్నారు.

దీనివల్ల ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లేదాకా తమ ఓటు హక్కు తొలగిపోయిన విషయం తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే, ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 172 ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని ప్రస్తుతం అంగీకరించడం లేదని, దీనివల్ల పట్టణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా ఆయన గుర్తు చేశారు.

సమస్య పరిష్కారానికి సీఎం ఎలాంటి సూచనలు చేశారు?

తెలంగాణలో సమీపంలో ఎలాంటి ఎన్నికలు లేనందున, జాబితా సవరణను సమగ్రంగా చేపట్టేందుకు తగినంత సమయం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న అభ్యంతరాల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని, తుది జాబితా ప్రచురణ తేదీని అక్టోబర్ 19 నుంచి తగినట్లుగా మార్చాలని ఆయన కోరారు.

గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ముందుగా విస్తృత ప్రచారం చేపట్టి, కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదా జాబితాలను బహిరంగంగా చదివి వినిపించాలని సూచించారు. నోటీసులు అందుకున్న రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వృద్ధులకు పత్రాలు సమర్పించేందుకు వారం రోజుల సమయం సరిపోదని, కనీసం మూడు నుంచి నాలుగు వారాలు ఇవ్వాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గ, పోలింగ్ కేంద్ర స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, అవసరమైన పత్రాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలని కూడా సూచించారు.

మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర పత్రాలను కూడా అంగీకరించేలా ఆధారాల జాబితాను విస్తరించాలని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని ప్రతి నియోజకవర్గంలో సగటున 78 వేలకుపైగా కేసులు ఉన్నందున, ఓటర్ల నమోదు అధికారి స్థాయికి దిగువన అదనపు అధికారులను నియమించి, నిర్దిష్ట తేదీలు, సమయాలతో వికేంద్రీకృత విచారణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. SIR ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రేవంత్ రెడ్డి ఆ లేఖలో స్పష్టం చేశారు.