హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు అవసరమైన IRFC రుణంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.
ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. సమావేశంలో హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అంశంపై విస్తృతంగా చర్చించారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, మెట్రో ప్రాజెక్టుకు IRFC నుంచి రుణ సదుపాయం కల్పించే అంశంపై సానుకూల స్పందన లభించిందని చెప్పారు.
ఈ అంశంపై మరింత ముందడుగు వేయడానికి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంగళవారం ఉదయం సమావేశం కానున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణ రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


