ప్రధాని మోదీకి, మహారాష్ట్ర సీఎంకు ఇద్దరికీ ఇచ్చిపడేసిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీకి, మహారాష్ట్ర సీఎంకు ఇద్దరికీ ఇచ్చిపడేసిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు.

“రైతుల వద్ద ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఉన్నా ప్రభుత్వం అన్నింటినీ కొనుగోలు చేస్తుంది. అధైర్యపడొద్దు. తడిచిన ధాన్యానికి కూడా కనీస మద్దతు ధర ఇస్తుంది. ప్రతి గింజా కొంటాం. రెండు రోజులు వెనకాముందు.. ప్రతి గింజా కొంటాం” అని ధైర్యం చెప్పారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కేవలం మద్దతు ధర ప్రకటించి వదిలేయడం కాకుండా రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం వైఖరి

రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలకమైన ధాన్యం కొనుగోలు, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరిని ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ రెండు కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. అందుకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గారిపై ప్రత్యేక బాధ్యత ఉందని గుర్తుచేశారు. కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తే తదుపరి తీసుకోవలసిన చర్యలపై జూన్ 15 తర్వాత కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.

“తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల పూర్తి చేయడం వల్ల ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ అనగానే తుమ్మిడిహెట్టి గుర్తొస్తుంది. ఆ ప్రాజెక్టును చేపట్టడానికి ఏడాది కాలం నుంచి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు.”

“రాష్ట్రాల మధ్య చర్చలు, సంప్రదింపుల ద్వారా నీటి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి గారు చెబుతున్నారు. అంతరాలు, అవాంతరాలను తొలగించుకోవడానికి సమయం ఇవ్వాలని మహారాష్ట్ర సీఎం గారికి లేఖ రాశాం. కానీ మహారాష్ట్ర సీఎం తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారు. సమస్య పరిష్కరించుకోవడానికి కనీస గౌరవం కూడా పాటించడం లేదు” అని ఆరోపించారు.

“నిర్లక్ష్యం చేస్తే, అవమానిస్తే తెలంగాణ ఊరుకోదు. మా బాధను, ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ విషయంలో రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గారు దూతగా వ్యవహరించాలి. ప్రజా ప్రభుత్వానికి బేషజాలు లేవు. పంతాలు పట్టింపులు లేవు” అని అన్నారు.

“తుమ్మిడిహెట్టి పూర్తి చేయడానికి మహారాష్ట్రలో 2,000 ఎకరాల భూసేకరణ చేయాలి. అందుకు మహారాష్ట్ర అంగీకరించాలి” అని పేర్కొంటూ పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిన విషయాన్ని ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి విషయాన్ని పదే పదే లేవనెత్తుతున్నా, లేఖలు రాస్తున్నా స్పందించే ప్రయత్నం చేయడం లేదు.

“మీకు పంచాయతీ కావాలా.. పరిష్కారం కావాలా అంటే మాకు పరిష్కారం కావాలని కోరుకుంటాం. రైతాంగ సమస్యల పరిష్కారమే నాకు కావాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ధాన్యం, ఇతర పంటల కొనుగోలు

“రాష్ట్రంలో ఇప్పటికే 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఇంకా 10 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నులు ఉండొచ్చని అంటున్నారు. 75 లక్షల వడ్లను సేకరించనున్నాం. ధాన్యాన్ని కేంద్రం సేకరించాలి. మిగతా రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదు” అని ఆరోపించారు.

రాష్ట్రంలో మొక్కజొన్నలు 40 లక్షల టన్నులు పండాయి. కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం మన మక్కలు, జొన్నలు, పొద్దుతిరుగుడు కొనుగోలు చేయాలి. కేంద్రం కొనుగోలు చేసేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలి అని కోరారు.

CM Revanth Reddy Kagaznagar Public Meeting 2 CM Revanth Reddy Kagaznagar Public Meeting 1 CM Revanth Reddy Kagaznagar Public Meeting 3

“తెలంగాణ రైతులు అనాధలు కాదు. దిక్కులేని వారు కాదు. తెలంగాణ ప్రజలకు గళమే లేదని అనుకోవద్దు. మహారాష్ట్రతో పరిష్కారం కావాలన్నా, విత్తనాలను, ధాన్యం కొనాలన్నా కేంద్రం ముందుకు రావాలి..” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి

“గడిచిన 60, 70 ఏండ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్లక్ష్యానికి గురైంది. అంతటి నిర్లక్ష్యానికి గురైన ఆదిలాబాద్ లో సమస్యల పరిష్కారం అంత ఆశాజనకమైన వ్యవహారం కాదని తెలుసు. కానీ జిల్లా అభివృద్ధి కోసం దృఢమైన సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నాం” అని చెప్పారు.

“ఆదివాసీ బిడ్డలు కోరేది ఆత్మగౌరవంతో బతకడానికి సొంత ఇండ్లు కావాలని. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఉన్నా పేదవాడి సొంతింటి కల నెరవేర్చకపోతే వృథా. నాగోబా జాతర ఆహ్వానం అందించడానికి వచ్చినప్పుడు పటేళ్లు గూడాల్లో పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వాలని కోరారు. అందుకే ఐటీడీఏ ప్రాంతాల్లో 21,000 అదనపు ఇండ్లను మంజూరు చేశాం.”

“ఇంకా కొంతమంది ఇండ్లు రాలేదని చెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్రంలోని తండాలు, గూడాల్లో నూటికి నూరు శాతం ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలి. అందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదిక నుంచి సంబంధిత మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చారు.

“పేదోడు గుడిసెలో ఉండొద్దు. పార్టీలకు అతీతంగా వివక్షలేని రాజకీయాలు, వివక్ష లేని సంక్షేమం, అభివృద్ధి చేయాలన్నది మా ఆలోచన. ఈ ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు గూడాల్లో ఇండ్లు లేని పేదలను గుర్తించాలి. వారికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. రాష్ట్రంలో గుడిసెలు లేని గూడాలను చూడాలనుకుంటున్నా. గ్రామ సభలు పెట్టి జాబితాలు సిద్ధం చేయండి.”

అవసరమైతే నాలుగు రోజులు ఇక్కడే ఉండి గూడాల్లో ఇండ్ల అవసరాలను గుర్తించాలని జిల్లా ఇంచార్జీ మంత్రిని ఆదేశించారు. సంవత్సరం తిరిగేలోపు గూడాల్లో ఒక్క గుడిసె కూడా ఉండటానికి వీలులేదు. అందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి.

“తల తాకట్టు పెట్టయినా ఇండ్లు కట్టిస్తాం. పిల్లల ఫీజులు, ఉద్యోగుల పెన్షన్ల వంటి ఎన్ని కష్టాలున్నా ఇందిరమ్మ ఇండ్లకు ఒక్క బిల్లు కూడా ఆపలేదు. వచ్చే సెప్టెంబర్ 17, 2026 నాటికి రాష్ట్రంలో మరో 1 లక్ష ఇండ్లలో గృహప్రవేశాలు చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలి” అని మంత్రి పొంగులేటి గారికి చెప్పారు.