హైదరాబాద్: అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో సరికొత్త శకానికి తెలంగాణ వేదికైంది. ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ ‘స్కైరూట్’ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘విక్రమ్-1’ ఆర్బిటల్ రాకెట్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ మామిడిపల్లిలోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రాకెట్ హార్డ్‌వేర్‌ను ఆవిష్కరించి, జెండా ఊపి శ్రీహరికోటకు పంపారు.
హైదరాబాద్ గర్వకారణం: విక్రమ్-1 ప్రత్యేకతలివే!
దేశీయంగా ప్రైవేటు రంగంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ కావడం విశేషం. దీనిని పూర్తిగా హైదరాబాద్‌లోనే డిజైన్ చేసి తయారు చేయడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. బహుళ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. ఈ రాకెట్ ఇప్పుడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది.
2047 లక్ష్యంగా ఏరోస్పేస్ హబ్‌గా తెలంగాణ
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవడమే తెలంగాణ లక్ష్యమని స్పష్టం చేశారు. “2047 నాటికి ఈ రంగంలో మన రాష్ట్రం తిరుగులేని శక్తిగా ఎదగాలి. ఇప్పటికే బోయింగ్, ఎయిర్‌బస్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. 2023-24 కాలంలో ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ 117.9% అద్భుతమైన వృద్ధిని సాధించింది” అని సీఎం వివరించారు.
యువతకు నైపుణ్యం – స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యం
కేవలం పరిశ్రమలు స్థాపించడమే కాకుండా, మన యువతకు మెరుగైన ఉపాధి లభించేలా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ (YISU) ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. స్కైరూట్ వంటి సంస్థలు ఈ యూనివర్సిటీతో చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు.
దీనిపై స్కైరూట్ సీఈఓ పవన్ కుమార్ చందన స్పందిస్తూ.. నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తమ రంగంలో ప్రధాన సమస్య అని, స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి పనిచేయడం తమకు ఎంతో మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
దావోస్ వేదికగా కుదిరిన ఒప్పందం
గత ఏడాది దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి సమక్షంలోనే స్కైరూట్ సంస్థ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఆ ఒప్పందం నేడు ‘విక్రమ్-1’ రూపంలో కార్యరూపం దాల్చడం పట్ల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్కైరూట్ సహ వ్యవస్థాపకులు నాగ భరత్ దాకా, గ్రీన్ కో వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ చలమలశెట్టి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula, along with Hon’ble Industries Minister Shri @OffDSB, flagged off the flight hardware of Skyroot Aerospace’s Vikram-1 – India’s first privately developed orbital rocket. The Chief Minister said the occasion marks a key… pic.twitter.com/gPFisnwD7b
— Telangana CMO (@TelanganaCMO) April 25, 2026
ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రం-1 ఆర్బిటల్ రాకెట్‌ను ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి అంతరిక్షం పేరుతో స్కైరూట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీ @OffDSB గారు సంస్థ ప్రతినిధుల సమక్షంలో… pic.twitter.com/jClTQqmoAb
— Telangana CMO (@TelanganaCMO) April 25, 2026
