జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాగు పెట్టుబడి సాయం కింద ‘రైతు భరోసా’ నిధులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన ‘రైతు ఉత్సవాల’ వేదికగా కంప్యూటర్ బటన్ నొక్కి, రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రైతు ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేశారు.
విడతల వారీగా నిధుల విడుదల
ఈరోజు ఒకేసారి రూ. 2,200 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
-
ప్రభుత్వం ఇప్పటివరకు రైతు భరోసా కింద మొత్తం రూ. 5,700 కోట్లు పంపిణీ చేసింది.
-
వచ్చే నెలలో మరో రూ. 3,300 కోట్లు విడుదల చేస్తామని సీఎం రైతులకు హామీ ఇచ్చారు.
వ్యవసాయం దండగ కాదు.. పండుగ!
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “దేశానికి వెన్నెముక అయిన రైతును ఆదుకోవడమే మా ప్రభుత్వ ప్రధాన విధానం. గతంలో వ్యవసాయం దండగ అన్న పరిస్థితి ఉండేది, కానీ దానిని పండుగలా మార్చాలన్నదే మా సంకల్పం” అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోపే 25.35 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని ఆయన గుర్తు చేశారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.
రైతులతో కలిసి ఉత్సాహంగా సీఎం
అంతకుముందు నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన ‘రైతు ఉత్సవ ర్యాలీ’లో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. ఎడ్ల బండ్లతో సాగిన ఈ ర్యాలీలో రైతులతో కలిసి నడుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
హాజరైన మంత్రుల బృందం
ఈ భారీ బహిరంగ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో సాగు పనుల్లో ఉన్న రైతులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
